Wednesday, June 30, 2010

కల్యాణ సుందరీ జగన్నాధ్

”నాకు చిన్న నాటి నించీ ప్రకృతి అంటే చాలా ఇష్టం. మనుషులూ, జంతువులూ, పక్షులూ ఎంతో ఇష్టం. నాలో నేను ఏడవగలను. ఏ కళారూపాన్నైనా నన్ను నేను మరచి అను భవించగలను… అతి బాల్యంలో పెద్దావుు దూడ మూతి చిక్కం ఎవరూ చూడకుండా విప్పేశాను- మనసు బాధ కలిగి… మరునాడు గొడ్ల సావిట్లో దూడ చాలా బాధ పడుతున్నది. మన్ను తిన్నదట. నేను మా బామ్మగారి కొంగు పట్టుకుని ఏడుపు ఆపుకుంటూ నించున్నాను. ”బుల్లెమ్మ గారేనండి ఇప్పే సింది నేను చూశా” అన్నాడు ఉగాది. మా బామ్మ నన్ను నిమ్మళంగా ఎత్తుకుని నాముఖంలోకి చూస్తూ కంట్లో నీళ్ళు తెచ్చుకుంది. ఈనాటికీ ఆ కన్నీళ్ళకి నాకు అర్థం తెలియడం లేదు”.ఇలా చెప్పుకోగల అవకాశం అదృష్టం పల్లెసీమల్లో పుట్టి పెరిగిన వాళ్లకే వుంటుంది. పుట్టి, ఆ పల్లె సీమల అమాయకత్వాన్నీ అందాన్నీ పరిశీలిస్తూ, ఆస్వాదిస్తూ పెరిగిన వాళ్ళ హృదయం ఎప్పుడూ ఆ అద్భుతమైన కాలాన్ని నెమరు వేసుకుంటూనే వుంటుంది. అందుకే, తను విన్న తను కన్న ఆంధ్ర భూమి, తన ”అలరాసపుట్టిళ్ళ”ను తలచు కుంటూ ఈ రచయిత తన పుస్తకాన్ని మన హృదయాలలో ప్రవేశపెట్టారు. 1941కి ముందున్న పల్లెటూర్లే తెలిసిన ఈమె మనసులో ఆనాడు పచ్చని చేలతో పల్లెపడుచుల నవ్వులతో, లేగల పరుగులతో అలరారిన తెలుగునాటి పల్లెసీమలే నిలిచి వెలిగాయి. వివాహమౌతూనే మద్రాసు మహానగరంలో పాదం పెట్టిన ఆమెకి తన పుట్టిల్లు ఒక పచ్చని జ్ఞాపకం. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలతో విస్తృత పరిచయం కల కళ్యాణసుందరి భాష, అచ్చం పుట్టింటి భాషే… దానిపై ఏ ప్రభావమూ లేదు. ఒక్కొక్క రచయిత పేరు చెప్పగానే ఆ రచయిత వ్రాసిన ఒక అద్భుతమైన కథ పాఠకుల మనసులో తళుక్కున మెరుస్తుంది. ఆ రచయిత ఎన్ని కథలు వ్రాసినా ఏదో ఒక కథే ఆమెని పదే పదే గుర్తు తెస్తుంది. ”అలరాస పుట్టిళ్ళు” అటువంటి కథ. స్త్రీ రచయితలు వ్రాసిన కొన్ని మంచికథలు అనే అంశాన్ని తీసుకున్నా ఈ కథ గుర్తు రావాల్సిందే. గ్రంథాలయాలను మెరుగు పర్చుకునే సంస్కృతిని కోల్పోయినాక చాలా మంది రచయితల పుస్తకాలు వ్యక్తిగత సేకరణలలో గానీ దొరకని సందర్భంలో సదాశివరావుగారు పూనుకుని మళ్ళీ ఆమె కథలన్నీ సేకరించి అందుబాటులోకి తెచ్చారు. లేకపోతే ఒక మంచి రచయిత కథలు చదివే అవకాశం ముందు తరాలకు వుండేది కాదు. ఎనభైలకి ముందే స్త్రీ రచయితలు మంచి కథలు రాసి వున్నారు. మనకు వాళ్ల రచనల్ని గురించి తెలుసు కోడమూ వాటిని సేకరించడమూ చారిత్రక అవసరం. స్త్రీల రచనలలో వచ్చిన పరిణామాలను తెలుసుకోడానికి కూడా. అవసరం.


ఈ వరసలో ముందు కళ్యాణసుందరిని తలుచుకుందాం. ఈమె వ్రాసిన ఇరవై కథల్లోకి వెళ్ళేముందు ఆమె జీవన నేపథ్యాన్ని తెలుసుకోవాలి కదా? అది కొంతవరకూ ఆమె తన పుస్తకానికి వ్రాసుకున్న ”నామాట”లోనూ కొంత అనే గ్రంథంలో కృష్ణాబాయిగారు వ్రాసిన వ్యాసంనుంచి సేకరించాను. విశాలాంధ్ర వారు ప్రచురించిన ”తెలుగు కథకులు కథన రీతులు” పుస్తకంలో ఆమె గురించిన వ్యాసంలో వ్యక్తిగత వివరాలు లేవు. 1922 జూన్‌ 22లో జన్మించిన కల్యాణసుందరి గారిది కృష్ణా జిల్లా. ఆమె వివాహం చేసుకున్న ఎన్‌. జగన్నాథ్‌ గారిది గోదావరి జిల్లా. కులాంతర వివాహం. జగన్నాథ్‌ గారు కమ్యూనిష్ట్‌… శ్రీశ్రీ, కొడవటిగంటిలకు మిత్రుడు. ఆహుతి సినిమా నిర్మాత. ఇద్దరి భావజాలాలో తేడాలున్నప్పటికీ. వీరిది స్నేహమయ దాంపత్యం. కుటుంబ స్నేహితుడైన మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి ప్రోత్సాహంతో భారతి పత్రికలో తొలికథ వ్రాశారు. అది దుఃఖాంత కథ. ఎందుకంటే ”జీవితంలో కష్టాలే నా కంట పడతాయి. కష్టాలంటె నాకు అభిలాష కాదు బాధ” అంటారు. 1941లో అలా కలం చేతపట్టిన కల్యాణసుందరి కుటుం బంలో జరిగిన కొన్ని విషాదాల వలన కథలకి దూరంగా ఉండిపోయారు. తరువాత మళ్ళీ జగన్నాథ్‌ గారి ప్రోత్సాహంతో కథలు వ్రాయడం మొదలుపెట్టారు. వరసగా అద్భుతమైన కథలు ”మాడంతమబ్బు”, ”అలరాస పుట్టిళ్ళు” వచ్చాయి.


ఆమె కథలు ఆమె జ్ఞాపకాలలో నించీ ఊహాప్రపంచంలో నించీ రూపుదిద్దుకుని సహజ సుందరంగా కలంనించీ జాలువారతాయేగానీ ప్రయత్నపూర్వకంగా వ్రాసినవి కావు. అలా వ్రాయగలగడం తన సుకృతమంటారు. స్వచ్ఛ సుందరమైన తెలుగు నుడికారం, మనుషుల పట్ల ప్రేమ, ప్రకృతిలో చిన్న చిన్న విషయాలను సైతం విడచి పెట్టని పరిశీలన ద్వేషరహితమైన ఆంతర్యం. ఏ పాత్ర పట్లా తొణకక నిర్మమకారంగా కథ చెప్పుకు పోవడం కల్యాణసుందరిని కథకులలో ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు. పల్లెవాసుల జీవితాలను ఎంత పరిశీలనాత్మకంగా చిత్రిస్తారో నగరవాసుల అలవాట్లనూ అంతే శ్రద్ధగా చిత్రిస్తారు. ఈమె కథలన్నిటిలో ప్రధాన వస్తువు ప్రేమ… ఎక్కువగా విషాందాంత ప్రేమ. ఇరవై కథలతో 1997లో మనకి అపు రూపంగా అంది వచ్చిన ఈ కథా గుచ్ఛంలో దాదాపు కథలన్నీ ప్రేమకి సంబంధించినవే. అలరాస పుట్టిళ్ళు. మాడంత మబ్బు, చిరుచెమటలు చందనం, సాయంకాలే వనాంతే, అనిల జ్యోతి, మనచేతుల్లో ఏముంది, సముద్ర జ్వాల మొదలైనవి. ఈ కథలన్నిటిలో తలమానికం అనుకునే కథ అలరాసపుట్టిళ్ళు. తరువాత మాడంతమబ్బు.


భూస్వామ్య కుటుంబాలలో పరువు ప్రతిష్టలకుండే ప్రాధాన్యత ఆపేక్షలకీ అంతః కరణలకీ ఉండదు. అందులోనూ పరువు ప్రతిష్ఠలను నిలిపి వుంచే బాధ్యత స్త్రీల మీదే వుంటుంది. ఆస్తులు అంతస్తులు, కులగోత్రాలు ఇవ్వన్నీ జాగ్రత్తగా కాపాడుతూ తమ మనసుల్లో ఎక్కడ స్రవించిన చెమ్మని అక్కడ ఇగరబెట్టుకునే బాధ్యత కూడా వాళ్ళదే. చిన్నప్పటినించీ ఆ ఎరుకతోనే పెరుగుతారుకనుక విధికి తలవంచే వుంటారు. కానీ ఎక్కడో సత్యవతి లాంటి నూటికొక్కరు మనసు చెప్పేమాట విని అలా విన్నందుకు శిక్ష అనుభవిస్తారు. సత్యవతిది స్పందించే హృదయం. అందుకే ముక్కూ మొహం తెలీని చెంగల్వరాయుడు మొదటిసారి గాయాలతో వస్తే తలుపు చాటునించే రక్తం తుడుచుకోడానికి గుడ్డ అందించింది. అన్న కన్నెర్ర చేస్తే లోపలికి పోయింది. చెంగల్వ రాయుడు తమ అంతస్తుకు తగడని తెలిసీ అతన్ని హృదయంలో పదిలపర్చుకుంది. మరొకరితో కాపురం చెయ్యలేక మళ్ళీ మళ్ళీ పుట్టింటికొచ్చింది. పరువుగల కుటుంబంలో స్త్రీలు అలా రావడాన్ని ఏ కుటుంబపెద్ద సహిస్తాడు? ఆమె అన్న కూడా సహించలేక పోయాడు బల్లకట్టెక్కించి గోనలేరులో తోసేశాడు. అంత దుర్మార్గానికి ఒడిగట్టిన అన్న చేతులు కడిగేసుకుని కాలు మీద కాలేసుకుని చుట్ట కాలుస్తూ కూచోలేక పోయాడు. అపరాధ భావంతో కృశించి పోయాడు. సిరిసంపదలు పరువు ప్రతిష్ఠలతో తులతూగిన అలరాస పుట్టింటి శిధిల చిత్రంతో కథ మొదలై పొరలు పొరలుగా ముడులు వీడి నిజం చెప్పి భార విముకుడైన అన్న మరణంతో ముగుస్తుంది… ముందు అరుగులతో మొదలుపెట్టి అన్న మరణ శయ్య వున్న గదిలో ప్రవేశించేవరకూ శిధిలమైన ఆ ఇంటిని వర్ణించడం కల్యాణసుందరికే సాధ్యం అనిపిస్తుంది”…. గడ్డివాములు వున్న చోట వరిగడ్డి కుళ్ళి మోకాటిలోతున పడివుంది. గచ్చుపగిలి సగం విరిగిన చావడిలో ఒకమూలన నులక మంచాలూ, విరిగిన గోనెమడత మంచాలూ మేటగా పడివున్నాయి. మరొకవైపున తుప్పుపట్టిన నాగటికర్రలూ, కొడవళ్ళూ, గొడ్డళ్ళూ, విరిగిన నాగలికొయ్య లూచీకిపోతున్న గోనెలూ పలుపులూ మేటగా పడివున్నాయి. కట్టుకొయ్యలన్నీ ఖాళీ.. పైకప్పు మీద పెంకులు లేచిపోయినయి. చాలా చోట్ల పెద్దగాలివానకి విరిగిన కొబ్బరిచెట్లు, బాదంచెట్టు పడినవి పడినట్లే ఎండి పోయినయి. సగం విరిగిన కమ్మరేగు చెట్లు విరిగినంతవరకూ తల్లి చెట్టునించి వేళాడుతూ అట్లాగే ఎండిపోయాయి. కుంకుడు బూరుగ చెట్ల కింద రాలిన పండాకులు మోకాళ్ల ఎత్తున రాలి ఎండుతున్నాయి. చుట్టూ ఉమ్మెత్త జిల్లేడి చెట్ల మయం.” ఒకప్పటి వ్యవసాయ వైభవం నిర్లక్షానికి గురై ధ్వంసమైన దృశ్యం. కంటి చూపుతోనే కుటుంబాన్నీ ఊరినీ శాసించిన సుబ్బారాయుడు చెల్లెలి హత్యతరువాత మంచంపట్టి ఆస్తీ అంతస్తూ పోగొట్టుకుని ఇంటిని గబ్బిలాలకు నిలయంగా చేసుకున్న వికృత విషాదాన్ని, రాచపుట్టిళ్ల క్రౌర్యాన్ని, వయోలిన్‌ మీద విషాద గీతాన్ని ఆలాపించి నట్లు ఈ కథని వినిపిస్తారు కల్యాణసుందరి. ఈమె కథలన్నీ ఆమె మనముందుకూచుని ”ఇహను ఆ తరవాత ఏంజరిగిందంటే” అని చెబుతున్నట్లుంటాయి. భాషా, వస్తువూ, కథనం, శిల్పం విడదీయలేనంత చిక్కగా కలిసిపోతాయి.. ప్రేమను వ్యక్తం చెయ్యడం ఎరిగిన భాగ్యాన్నీ, ప్రేమకూ అనుమానానికీ తేడా తెలియని పెద్దిరాజునూ కరువు విడదీసింది. పెద్దిరాజు వలసకూలీగా వెళ్ళిపోవలసి వచ్చింది. అతనొస్తున్నాడని తెలిసి అతనితో కలిసి భోజనం చెయ్యాలని ఆశపడి ఆకూ వక్కతో సహా అన్నీ అమర్చి, అతనికి అన్నం తిన్నాక బెల్లం ముక్క నోట్లో వేసుకోడం అలవాటని గుర్తొచ్చి వర్షంలో కొట్టుకు వెళ్ళి తెచ్చేలోగానే ఇంటికొచ్చిన పెద్దిరాజు కిటికీ లోనించి రెండు కంచాలనూ లోటాలనూ చూసి అనుమాన పడి వెళ్ళిపోతాడు ”మాడంత మబ్బు”లో. ఈ కథలో కూడా గ్రామీణ వ్యవసాయ నేపథ్యాన్ని అద్భుతంగా చిత్రించారు రచయిత. ”తొలకరికి ముందు పక్క వూళ్లో వున్న చుట్టాలను చూసి వస్తుంటే కొల్లేరు ఎండి వుంది అందులో గుంటలలో అక్కడక్కడ నీళ్లున్నాయి. జమ్ము నిలువెత్తుకు పెరిగి వుంది. జమ్ములో కొంగలు నిలువెత్తు గూళ్లు కట్టుకున్నాయి. పెద్దిరాజు నిలబడి పోయాడు.” ఈ ఏడు ముంపు వస్తుందే!! మన గతి ఏమిటో!! గూళ్ళు చూడు ఎంత ఎత్తుగా కట్టాయో పిట్టలు!! అన్నాడు. భాగ్యం కృంగిపోయింది.” ముంపు వచ్చే సంగతి ముందు పిట్టలకీ, వాటిని బట్టి గ్రామీణులకీ తెలిసి పోతుందన్నమాట.


”మాడంత మబ్బు పట్టె మంగళగిరి మీద,
కురిసేను తిరుపతిలో కుంభ వర్షాలు,
కుంభవర్షాల్‌ కురిసే, స్థంబాలే తడిసే
వెంకన్న వెండరుగు తడిసె,
మంగమ్మ కూచున్న మండపమే తడిసే” అని పాడకుంటుంది భాగ్యం

పెద్దిరాజు అనుమానమే మాడంత మబ్బు. అది కుంభవర్షం కురిస్తే గానీ తెరిపివ్వదు. ఎప్పటికప్పుడంతే!! చిరుచెమ టలు చందనం కథలో అలిమేలు సత్యాన్ని గాఢంగా ప్రేమించింది. అంతస్తులు తేడా వల్ల ఆమెకు అతనితో పెళ్ళి కాలేదు. కానీ జబ్బులో వున్న అతని బాగుకోసం దైవాన్ని ప్రార్థిస్తూనే తన వైవాహిక జీవితాన్ని ఆమోదిస్తుంది… సాయంకాలే వనాంతే కథలో, మొదటి వివాహాల వల్ల వంచితులైన స్త్రీ పురుషులు దగ్గరై, క్తొత జీవితం ప్రారంభించి అర్థవంతంగా ప్రేమాను రాగాలతో జీవిస్తారు. అతను ఆకస్మికంగా పోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. సౌభాగ్యవతిలో తల్లి, అనిలపుష్పంలో భార్య మూర్ఖులు. జీవించడం. జీవించనివ్వడం తెలియని వాళ్ళు…. తండ్రీ కూతుళ్ళ ప్రేమ, తండ్రీ కొడుకుల అనురాగం, తల్లీ కొడుకుల ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, ఇవ్వే ఆమె కథలనిండా వుంటాయి. వాద వివాదాలు, సిద్ధాంత నిరూపణలు, ఆవేశాలు, కాగడాలకి కూడా అందవు. రచయితకి మానవత్వం పైన, ప్రేమ పైన, జీవితం పైన అమిత గౌరవం. ఆమె విధిని నమ్ముతారు.” ”let us accept fate not fatalism” అని రాస్తూవచ్చానంటారు. ”మానవ ప్రయత్నాలు అన్ని వేళలా ఫలితాలనివ్వవు. కానీ మానవులు ప్రయత్నాలు మానకూడదు” అనేది ఆమె నమ్మకం. థామస్‌ హార్డి ఆమె అభిమాన రచయిత. కథా రచన ఆమెకొక కమనీయ అనుభవం. తలవంపులు తెచ్చే అజ్ఞానాలూ, మూఢత్వాలూ, తప్పులను మినహాయించి, మన పూర్వపు నాగరికత ఔన్నత్యమూ, సంప్రదాయాలూ, నమ్మకాలు, అర్థవంతమైనవనీ వాటిని యువతకు పరిచయం చెయ్యాలనీ ఆమె ఆకాంక్ష.
అలరాస పుట్టిళ్ళు కథ ఆమె కుటుంబంలోనే ఆమె పూర్వీకుల కుటుంబంలోనో జరిగివుండాలనీ లేకపోతే ఆ కథ పాఠకుల హృదయాలలో నిలిచిపోలేకపోయేదనీ ఆమె మేనకోడలంటే ”మేరీ షెల్లీ, ఫ్రాంకెన్‌ స్టెయిన్‌ ఎలా వ్రాయగలిగింది?.”many factors contribute to such deep stories…Sub conscious,psyche,,..our own studies like the list goes on”.” అని సమాధానమిచ్చారట కల్యాణసుందరి. ఆమె కథా కథన చాతర్య రహస్యం అదే కావచ్చు. 2000 సంవత్సరంలో చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో కల్యాణసుందరిని కలిశాను. జీవితంలోని ఆటుపోట్ల ప్రభావం వయస్సు ప్రభావం ఆమె తనువుపై చాలా కనిపించినా, మనో సౌకుమార్యం, నమ్రత నిరాడంబరత, ప్రేమతత్వం మాత్రం చెక్కు చెదరలేదు. 2002 జులై 19న ఆమె శారీరకంగా మనకు లేకుండా పోయారు. నా కెప్పుడూ ఆమె ఒక కథలో అన్నమాట గుర్తుకొస్తుంది.” ”గర్వం వుండటం గర్వకారణం కాదుకదా?” అని. ఆ ఎరుక ఎంతమందికుంటుంది?


భూమిక April 2010
పి.సత్యవతి

Tuesday, June 29, 2010

రంగుటద్దాల కిటికి

భారతీయుల ప్రవాసం ప్రారంభమై చాలాకాలమైంది. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యాధిపత్యం కిందకి రాగానే వారు ఆక్రమించిన అనేకానేక దేశాల్లోకి భారతదేశం నించీ అనేకమందిని indentured labourకింద తరలించారు.ముఖ్యంగా ఫిజి,మలేసియా,శ్రీలంక,కరీబియన్ దేశాలకు.వీళ్ళు ఒక పరిమితకాల ఒప్పందంపై వెళ్లినా చాలామంది తిరిగి రాలేక అక్కడే స్థిరపడిపోయారు.తరువాత బ్రిటిష్ హయాం లోనే బార్ ఎట్ లా వంటి చదువులకు భారతదేశం నించీ ఇంగ్లండ్ వెళ్ళారు .స్వాతంత్య్రానంతరం కూడా ఉన్నత విద్య కోసం.ఉద్యోగాలకోసం వెళ్ళారు.1950,60లలో ఇంజినీర్లుగా డాక్టర్లుగా అమెరికా ఇంగ్లండ్ వెళ్లారు.దుబాయ్ ,ఇరాన్ కూడా వెళ్ళారు.1990 ల తరువాత వచ్చిన సాఫ్ట్వేర్ బూమ్ తో వలసలు వరదే అయ్యాయి.విద్యార్ధులు అప్పుడూ ఇప్పుడూ వెడుతూనే వున్నారు.ఇక మన దేశం నించీ కార్పెంటర్లు,ప్లంబర్లు,తాపీ పని వారు మధ్యప్రాచ్యానికి వెడుతున్నారు.వీరేకాక నైపుణ్యాలతొ పని లేని చిల్లర ఉద్యోగాలకి కూడా వెడుతున్నారు..పుట్టిన దేశం నించీ మరో దేశానికి వెళ్ళి ఆ మెట్టిన దేశంలో వీళ్ళంతా ఎలా జీవింఛారు?జీవిస్తున్నారు? వాళ్ల ఆవేదనలు,ఆనందాలు సంవేదనలు,మాతృదేశంపై మమకారాలు చిత్రించిన సాహిత్యం చాలా వచ్చింది.కరీబియన్ లో స్థిర పడ్ద వారి జీవితాలను గురించి వి.ఎస్.నైపాల్,,అమెరికా జీవితానుభవాలగురించి భారతీ ముఖర్జీ వంటివారు.ఇప్పుడు చిత్రా బెనర్జీ,ఝంపా లహరి ఇంకా చాలామంది వ్రాస్తున్నారు.అట్లాగే చైనా జపాన్ శ్రీలంక,ఐర్లండ్,నైజీరియా,ఇరాన్,పాకిస్తాన్,వంటి దేశాలనుంచీ అమెరికా వచ్చి స్థిర పడ్ద వారు వ్రాసిన సాహిత్యం కూడా ఇంగ్లిష్ అనువాదాల్లో చాలా వచ్చింది..తెలుగు సాహిత్యం ఇటీవల వస్తూంది.తెలుగు వలసలు కూడా అధికమయ్యాయి.ఉద్యోగాలకి,చదువులకే కాక ఉద్యోగాలు చేసే అమ్మాయిలకి “పురుళ్ళు” పొయ్యడానికి,పిల్లల్ని పెంచిపెట్టడానికి వెళ్ళే తల్లులు,వాళ్ళతోపాటు తండ్రులు,ఇండియా వేసవి తాపం తప్పించుకోడానికి వెళ్ళే తల్లితండ్రులు ఇట్లా అమెరికా వెళ్ళే విమానాలు ఆంధ్రులతో కిక్కిరిసి పోతున్నాయి.అమెరికాలో వుండటం అంటే”you must be one or the other” అని కాక “ I want to be both”అని హాన్ సూయన్ లా చెప్పగలిగి.,పుట్టింటి అనుబంధాన్ని పదిలంగా కాపాడు కుంటూనే అమెరికా జీవితంలో ఒదిగిపోయిన తెలుగు వారి జీవితాలను ఆవిష్కరించిన ఒక మంచి కధాసంకలనం ఇటీవల వచ్చింది.”తుపాకి”అనేకధ ద్వారా పాఠకుల మనసులో నిలిచిన నారాయణస్వామి వ్రాసిన 21 కధలు ఇందులో వున్నాయి..ఇండియాలో వుండే వాళ్ళకి అమెరికా జీవితం పట్ల అనేక “మిత్స్” వుంటాయి. అక్కడే వుంటూ ఆదేశానికి అలవాటుపడుతూనే తమ సంస్కృతులను కాపాడుకుంటున్న ఇండియన్ అమెరికన్స్ వ్రాసిన సాహిత్యం అటు అమెరికన్ జీవితాన్నీ ఇటు ప్రవాస హృదయాన్నీ ప్రతిబింబింబించి నిజాన్ని కళ్ళముందుంచుతుంది.”రంగుటద్దాల కిటికీ” ఆ పని జయప్రదంగా నెరవేర్చింది.
పిల్లల్ని శారీరకంగా పెంఛడం ఎంతముఖ్యమో వాళ్ల చైతన్యాన్ని, ఆలోచనా శక్తినీ పెరగనివ్వడానికి కృషి చెయ్యడం అంతకన్న ముఖ్యం అని అర్ధం చేయించే రెండు కధలు ఈ సంపుటిలో ముందు వరసనుంటాయి.అవి,”తుపాకి” “చక్కని చుక్క”..ఆలోచనలు చిగురువేస్తున్న అతి పిన్న వయసులో,తల్లి తండ్రులు,స్నేహితులు,పాఠశాలలో ఉపాధ్యయులు,చదివే పుస్తకాలు.టీవీ అన్నీ మనసులో చెరగని ముద్రలు వేస్తాయి.తెల్లకాగితం వంటి చిన్నారి మనసులలో అవి అహేతుక ద్వేషాలను ప్రవేశ పెట్టడం వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయి.బయటి ప్రభావాలను ఆపగల శక్తి ఒక తల్లి తండ్రులకే వుంటుంది.పిల్లలకి విలువల గురించి అర్ధం అయ్యేలా చెప్పడం .అమెరికా లో వుంటూన్న గన్ కల్చర్ నించీ పిల్లల్ని కాపాడుకుని వాళ్లల్లో సహృదయతనీ స్నేహస్వభావాన్నీ పెంపొందించాలంటే తల్లి తండ్రులే శ్రధ్ధ పెట్టాలి.ఇండియాలో దళిత విద్యార్ధులపై జరిగే వికృతమైన రాగింగ్ కూడా అలాంటిదే.తమ అవకాశాలను వాళ్ళు ఎగదన్నుకు పోతున్నారని ఉక్రోష పడ్డం లాగే ఈ కధలో ఒక పిల్లవాడు తమ అవకాశాలన్నీ నల్లవాళ్ళు ఎగరెత్తుకుపోతున్నారని తండ్రిద్వారా విని స్కూల్లో సహ విద్యార్ధి మీద కాల్పులు జరుపుతాడు.అట్లాకాక మరొక తండ్రి నల్లవాళ్ళు మన సాటి మనుషులేనని చెప్పి స్నేహాన్ని ప్రోదిచేస్తాడు.చక్కని చుక్క అనే కధలో అమ్మాయి తన వయసుని మించిన తెలివికలది.ఆ విషయం ఆ పిల్ల తల్లి తండ్రులకే కాక ఆపిల్లకు కూడా బాగా తెలిసి తనొక సెలెబ్రిటీ ననుకుంటుంది.తన తోటిపిల్లల్తొ తన వయసుకు తగ్గట్లుగా కాక తనని మెచ్చుకునే వాళ్ళతో తన flatter చేసే వాళ్ళతో ఎక్కువ చనువుగా వుంటుంది.తమ పిల్ల ఆటా పాటా అందం చందం తెలివీ మార్కులూ గ్రేడ్లూ ,అందరిమెప్పూ మాత్రమే పట్టించుకుని ఆమెను గారంగా చూసుకునే తల్లితండ్రులు,ఆ పిల్ల సెలెబ్రిటీ కాంప్లెక్స్ తో ఏ దారిన నడుస్తోందో పట్టించుకోరు .చిన్నతనంలోనే పిల్లలు అద్భుతమైన కళాభినివేశాన్నో మరొక నైపుణ్యాన్నో ప్రదర్శించి మన్నన లందు కున్నప్పుడు సంతోషమే కానీ అదే జీవితం కాదనీ ఏ వయసుకు తగ్గ ఆలోచనలు ఎదుగుదలా. ఆవయసుకుం డాలని తెలుసుకోరు ఆ పిల్ల చురుకుతనాన్నీ చొరవనీ అమాయకత్వాన్నీ ఎక్స్ ప్లాయిట్ చేసిన ఒక వివాహిత యువకుడు చివరికి ఆ పదహారేళ్ల పిల్లనూ బ్లాక్ మెయిల్ చేసి పెళ్ళిచేసుకోవాలని చూసినప్పుడు ఒట్టి మూర్కుల్లా ప్రవర్తించబోతారు.అమెరికా లో స్థిరపడినా మళ్ళీ పాతకాలపు భారతీయ తల్లితండ్రుల్లాగే అతనికే ఇచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తారు.. మొదటినించీ ఆ పిల్ల ప్రవర్తనను పరిశీలిస్తూ వచ్చిన సుచరిత ఆమె కు అండగా నిలిచి పదహారేళ్లయినా నిండని ఆ చక్కని చుక్క ఇంకా చదువుకోవాలని మంచి భవిష్యత్తుని వెతుక్కోవాలని తెలియ చెప్తుంది..ఇవాళ మనం చూస్తున్న రియాలిటీషోల్లో పిల్లల తల్లి తండ్రులు ఈ కధ చదివితే ఎంత బాగుండునో అనిపించింది.అట్లాగే ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలైనా మనువు బిడ్దలే అనే కధ “ఇండియన్ వేల్యూస్” అమెరికాలో వున్నా ఎక్కడవున్నా,అమ్మాయి చదువూ తెలివీ కాదు,అందంచందం కూడా కాదు ఆమె కన్యాత్వమే ముఖ్యం అనుకునే యువకులని ఈ కాలపు అమ్మాయిలు “నువ్వు కూడా వర్జిన్ వేనా?” అని తప్పకుండా అడిగి మరీ సారీ చెప్తారు కదా? అయితే ఇట్లాంటి మూస తల్లితండ్రులు కాక విలక్షణమైన ఒక తల్లి “నీవేనా నను పిలచినది” అనే కధలోనూ ఒక తండ్రి “వీరిగాడి వలస”అనే కధలోనూ కనిపిస్తారు...ఇంకా ఇలాంటి మంచికధలు,చక్కని ప్రేమకధలు, ఈ పుస్తకంలో వున్నాయి.’రంగుటద్దాల కిటికీ ’అనే ఈ కధా గుఛ్చం అన్ని పుస్తకాల దుకాణాల్లో దొరుకుతుంది..మంచికధలు వ్రాసే ఈ నారాయణస్వామికబుర్లు కూడా వినాలంటే కొత్తపాళీ అనే బ్లాగ్ చూడొచ్చు.