Monday, December 21, 2015

పేరు లేని పిల్ల

               పేరు లేని పిల్ల
మాలచ్మి గుమ్మంలో కూచుని వుంటుంది .ఆమె చేతిలో మువ్వల వెండి పట్టీలూ చిన్న చిన్న బంగారు లోలాకులూ వుంటాయి కళ్ళనిండా నీళ్ళూ వుంటాయి. అట్లా ఆమె అక్కడకూచోబట్టి ఆరునెలలు అయిపోయింది.ఒకప్పుడు ఆమె పనిచేసిన ఇంటి మేడమ్ కారులో అటుగా వస్తూ అక్కడ ఆగి “దా మాలచ్మీ మాఇంటికి పోదాం”అంటుంది
“నేనింక పని చెయ్యలేనమ్మా ఎవర్నన్నా చూసుకోమన్నాగందా? వినవేంటి? “అని కసురుతుంది మాలచ్మి.
“పనికోసం కాదు ఊరికేనే..కాసేపు మాట్లాడుకుందాం రా”
“ఏం మాట్లాడతావ్? నీకు వంద పన్లు కొవ్వొత్తులు పట్టుకు తిరగడాలూ అవీ ఇవీ.నాపిల్ల సంగతి నీకేంపట్టింది.నేను మీ ఇంటికి రాను” అని మొహం మరో వైపు తిప్పుకుంటుంది మాలచ్మి. ఆవిడ ఒక నిట్టూర్పు విడిచి వెళ్ళిపోతుంది.ఈ మధ్య ఎవరు కదిలించినా ఇట్లాగే చిరాకుపడుతుందట మాలచ్మి .ఆమెను మళ్ళీ పూర్వపు మాలచ్మిని చెయ్యాలనే ఎవరి ప్రయత్నమూ ఫలించడంలేదు..
***************************************************************************
మాలచ్మిపోలీస్ స్టేషన్ వరండాలో ఒక స్థంబానికి  ఆనుకుని తల చేతిలో పట్టుకుని కూచుంది.వాళ్ళాయనా, కొడుకూ లోపల ఎస్సై గారితో మాట్లాడుతున్నారు, ఆమె కళ్ళుతుడుచుకుంటూ లోపలికి చూస్తోంది అప్పుడప్పుడూ.
కాసేపటికి వాళ్ళు బయటికొచ్చారు.వాళ్ళతో పాటు ఆమె కొడుకు తోలే కారు ఓనరు రవీంద్రబాబుగారు కూడా వచ్చారు. ఆయన మాలచ్మి కేసి చూస్తూ “కంప్లేంటు రాసుకున్నార్లేమ్మా! ఇంక ఇంటికి పోండి.ఎతుక్కొస్తార్లే; నేకనుక్కుంటూ వుంటాగా” అన్నాడు
“ దా !పోదాం ఈడ కూకుని చేసే దేంలేడు”అని కసురుకున్నాడు మాలచ్మి వాళ్ళాయన .కొడుకు యజమానిని కారెక్కించుకుని వెళ్ళిపోయాడు.
“పాపం ఈళ్ళని కాస్త ఇంటికాడ దిగబెట్టూ”అంటాడేమో ఆయన అనుకుంది మాలచ్మి.ఆయనకేమన్నా పిచ్చా.ఏంది అనుకుని కాళ్ళీడ్చుకుంటూ వాళ్ళాయన వెనకే బయలుదేరింది.
అతను వేగంగా  నడుస్తున్నాడు.ఆమె అనుసరిస్తున్నది. కాళ్ళూ లాగుతున్నాయి రెండురోజులుగా తిండి లేదు.రిక్షా ఎక్కి పోదామంటాడేమోనని చూసింది.అతనిపాటికి అతను గబగబా నడుచుకుపోతున్నాడు అతనికి కోపం వస్తే అంతే అట్లా గబగబా నడుస్తాడు వెనకచూపు లేకుండా.మాలచ్మి రొండిన పదిరూపాయలున్నాయి ఈమద్దెన సైకిల్ రిక్షా లే కనపడ్డంలేదు.అంతలో ఓ షేర్ ఆటొ అటుగా వస్తే ఆపి ఎక్కింది.ఆయన్ని కూడా ఎక్కమందామా అంటే చాలా ముందున్నాడు .ఎవరి కర్మ ఆళ్ళది అనుకుంటూ కూచుంది.
ఇంటికి రాగానే నలుగురూ ఎగబడ్డారు .పోలీసులు ఏమన్నారేమిటీ అంటూ.
పోలీసులేమంటారో వాళ్ళకి తెలీనిదా?
“ సరే కానియ్! టీ పెట్టుకు తాగు .అన్నం ఉడకెయ్! అంతా బగమంతుడి దయ ! ఎంతకని ఏడుస్తావ్? “అని తలకి కట్టుకున్న తువాలు విదిలించి భుజానేసుకుని ఎక్కడికో పోయాడు వాళ్ళాయన .బంగారమంటి పిల్ల! ఏ బ్రహ్మ రాక్షసుడెత్తుకు పోయాడో! ఇంగ్లీషు లో మార్కులు తగ్గినయ్యని ఒకాయన కాడ ప్రయివేటు చెప్పించుకుంటోంది.అట్టా ప్రయివేటుకని వెళ్ళిన పిల్ల ఇంతవరకూ అయిపులేదు. ఉధృతంగా దుఃఖం వచ్చింది మాలచ్మికి. శోకాలు పెట్టి ఏడ్చుకుంటూ గుమ్మంలోనే కూర్చుండిపోయింది.
నిన్న పొద్దున రవీంద్రబాబు గారులేకుండా అచ్చంగా తనూ కొడుకూ పోయి కంప్లేంటిస్తే ఆ పోలీశు నాకొడుకు ఏమన్నాడు.? “ఎవడితోనో లెగిసిపోయి వుంటదిలే ! నాలుగురోజులు షికారు చేసి అదే వస్తది .ఈ లోగా మా ప్రాణాలు తియ్యకండి”అన్నాడే గాని కంప్లేంట్ వ్రాసుకున్నాడా? తెల్లని ఇస్త్రీ బట్టలూ నాలుగువేళ్ళకీ నాలుగు వుంగరాలూ ఒక కారూ వుంటే గానీ రాసుకోడు కామాల!
“ఇంకా గుమ్మంకాడ నే కూకుండావా? లెగిసి పొయ్ ఎలిగించుపో ! ఎవడు చేసిన కర్మ ఆడు అనుబగించాల్సిందే! చేతులారా సేసుకున్నావ్ ! ఇప్పుడేడిస్తే ఏం లాబం?పో పో ! ఎళ్ళి కూడొండు. తినక పోతే కళ్ళుతిరిగి సస్తావ్” అన్నాడు మాలచ్మి వాళ్ళాయన .
మాలచ్మి మాట్లాడలేదు అక్కడ్నించీ లేవనూ లేదు.అతనే పోయి పొయ్యి వెలిగించి టీ కాచుకొచ్చి ఇఛ్ఛాడు తాగనని మొండికేస్తే తిట్టి తాగింఛాడు.
“సేసిందంతా సేసి ఇప్పుడు ఈ ఏడుపేందే! “అని అరిచాడు. ఆ తరువాత “పాపం నువు మాత్తరం ఏం సేస్తావులే.అంతా బాగుంటుందనుకున్నావు. ఏడుస్తూ కూకుంటే మనకి బతిమాలి తిండేవరూ పెట్టరు. పద పద “అని ఓదార్చాడు.
“ ఎతుక్కొస్తార్లే అమ్మా! ఏడవమాక .మా సార్ కూడా కనుక్కుంటూ వుంటానన్నారుగా! నువ్వు పనిచేసే మేడమ్ కి కూడా చెప్పు.ఆవిడకేదో సంఘం వుందిగా “ అన్నాడు అప్పుడే వచ్చిన కొడుకు.
చాలాసేపటికి మాలచ్మి లేచింది.అయినా ఆమె కళ్ళల్లో నీళ్ళూరుతూనే వున్నాయి.
మాలచ్మి పనిచేసే మేడమ్ వచ్చింది. మూడురోజులుగా ఆమె పని ఎందుకు ఎగ్గొట్టిందో తెలుసుకోవాలని. మాలచ్మి ఆమె చెయ్యిపట్టుకుని మళ్ళీ కంటికి కడివెడుగా ఏడ్చింది. మీ సంఘం వాళ్ళతో చెప్పి నా బిడ్డ సంగతి చూడు తల్లీ అని వేడుకుంది.ఆవిడ చూస్తాననే  అంది కానీఅయితే నువ్విప్పట్లో పనికి రావా ఏంటి?’అనికూడా అంది.
నా వల్ల్ౙ కాదు తల్లీఅని కూతురి కబురు చెబుతూ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది మాలచ్మి.
దిగులుపడమాకు. నీకూతురికేంకాదులే వచ్చేస్తుందిఅని ఓదార్చి వెళ్ళీపోయింది మేడమ్.
వారంరోజులాయె! పదిరోజులాయె.
ఒక రోజు పోలీశ్ స్టేషన్నుంచీ కబురొస్తే దేముడు పటానికి దండంపెట్టుకుని లెంపలేసుకుని పరిగెత్తినట్లే పోయింది ,
బందరు లాకుల కాడ కొట్టుకొచ్చింది ఒక శవం! లంగాణీ, చెవులకి బుట్టలు. ఒకేళ మీ అమ్మాయేమో చూడు!”
అమ్మో నాతల్లో! నువ్వు  కావద్దు నువ్వు కావద్దుఅంటు పోతే నిజంగానే మాలచ్మి కూతురుగాదు.గుండే అవిసిపోయింది తల్లా! ఎవరిబిడ్డో ఏమో! అయ్యో నా తల్లీ!
 రైలుపట్టాల మీద పిల్ల! తలకి తల !మొండానికి మొండేం! లంగా ఓణీ బుట్టలు. అమ్మయ్య మా అమ్మాయికాదు స్వామీ.
బొంబాయిలో దొరికిన తెలుగుపిల్లల్ని పట్టుకొచ్చాం .ఒక పిల్లది వూరేనంది. చూడు. మా అమ్మాయి కాదు నాయనా! చస్తున్నాం పోలీసు స్టేషన్ కీ కాలవ ఒడ్డుకీ, రైలుపట్టాల కాడికీ తిరగలేకరెండుమూడు రోజులకి శవాలు! ఇంతమంది పిల్లలు ఎందుకు చస్తున్నారు దేవుడా! ఏమైంది వీళ్లకి .తిని తిరగలేక తీపరమొచ్చిందా?
శవాలు వస్తూనే వున్నై .మీ అమ్మాయికనిపించక చాన్నాళ్ళయింది కదా?ఇవ్వన్నీ కొత్త శవాలు.ఎవరితోనో దొబ్బేసుంటది.నోరుమూసుకుని వూరుకోండి.అంటున్నారు బంధువులు,ఇరుగుపొరుగులు.
 రవీండ్రబాబు గారికి మాత్తరం పనుల్లేవా? ఎన్నిసార్లని పోలీసులని కనుక్కుంటారు? మేమ్ కి మీటింగ్ లు ధర్నాలు కొవ్వొత్తుల ప్రదర్శనలు . ఆవిడకి మాత్రం సంగతొక్కటేనా? దేవుడి మీద భారం వేసి మన పనులు మనం చేసుకోవాలి. అంటున్నాడు మాలచ్మి కొడుకు.
దానికి చదువొద్దే అని నెత్తీ నోరూ కొట్టుకుంటే వినిందా?పద్దెనిమిదేళ్ళు రావాలని తళ్ళీ కూతుళ్ళిద్దరూ ఒకేమైన  కాకిగోల. దూకుంటా నాన్నా సదువుకుంటా నాన్నా! ఇప్పుడేమైంది. సదువూ పోయింది పిల్లా పోయింది.తల బాదుకుంటాడు మాలచ్మి వాళ్ళాయన. ఆవేశంలో పెళ్ళాం మీద గంతులేస్తాడు. ఆవిడ కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది .మళ్ళీ ఓదారుస్తాడు. తిండి తినిపిస్తాడు.కొడుకు నిద్రలేస్తూనే కారెక్కుతాడు రాత్రి పదింటికే మళ్ళి ఇంటికి
వరుసకి మేనత్త కొడుకయే  వీరభద్రానికి చేద్దామే అని పదో క్లాసు పాసైన రోజే అన్నాడు మాలచ్మి మొగుడు.”ఆడ్ని నేను సస్తే సేసుకోను నాన్నా!నేనా పల్లెటూళ్ళో వుండలేను. నేను సదువుకుంటాను.నాకింకా పదహారే .పదహారేళ్లకి పెళ్ళిచేస్తే నిన్ను జైల్లో పెడతారుఅంది కూతురు.పోట్లాట! పోట్లాట.ఒకటే పోట్లాట. .వీరభద్రం మంచోడు, వాడితల్లీ మంచిదే. డికో ఇల్లుంది.ఎవరిదో పొలం కౌలికి చేస్తాడు. పెళ్ళాం దానికి వంత పాడింది .తనకూతురేదో పెద్ద చదువు చదివి కలక్టర్ అయిపోతుందన్నట్లు.
.కాలేజీ చదువు కదాని, ఉన్నంతలో కాస్త మంచి బట్టలు, చెప్పులు! దేనికి లోటు చేశామనీ? అదైనా మంచిపిల్లేనే.ఒక్క మగ స్నేహుతుడూ లేడు. దాని పుస్తకాలు బట్టలూ అన్నీ తెగ వెతికారు పోలీసులుకూడా ఎక్కడా ఒక్క పొరపాటులేదు.పాఠాలు నోట్సులు తప్ప లవ్ లెటర్స్ లేవు .అందరికీ సెల్ ఫోన్లున్నా దానికి లేదు .ఒకటిరెండుసార్లు అడిగిందేకాని తను కొనివ్వలేదు.కొనిస్తే ఏదైనా ప్రమాదం లో చిక్కుకుంటే అన్నకైనా ఫోన్ చేసివుండేదేమో! అనుకున్నప్పుడు నాన్న గజగజ లాడిపోయాడు. ’అమ్మాయికి ఫోన్ కొనొస్తే బావుండేదేమోనే లచ్మీ”అని పక్కన కూచుని తుండుగుడ్డతో కళ్ళు తుడుచుకున్నాడు.
“ఎట్టాగైనా ఒప్పించి పెళ్ళిచేసేస్తే బాగుండేదేమోనయ్యా”అంటుంది మాలచ్మీ.
“ఈ ఎదవ ఇంటర్ చదువు చదివి ఏం సెయ్యాలని కాలచ్చేపానికి కాక పోతే !నేను ఇంటర్ చదివి ఏం ఎలగ బెడుతున్నాను ? ఈ సదువులు దండగ” అంటాడు కొడుకు. పిల్ల కనపడక పోయిన మూడో నెలలో కామోసు దాని స్నేవితురాలు నాగమణిని కాలేజీ మాన్పించి పెళ్ళిచేసేశారు. ఇప్పుడు  తొందరగా పెళ్ళి సెయ్యడమే రైటు.
పది చేతులతో పని చేసే మాలచ్మి పదిచేతులూ చచ్చుబడిపోయాయి. వొళ్ళిరుచుకుని పని చేసి మొగుడికి తెలీకుండా కూతురికోసం కొన్న వెండీ పట్టాలూ  మూడు గ్రాముల లోలక్కులూ రోజూకొకసారి చూసుకుంటూ వుంటుంది.వాకిట్లో కూచుని కూతురికోసం ఎదురుచూస్తూ వుంటుంది..మాలచ్మి పని చెయ్యకపోవడం ఆ ఇంటి ఆదాయానికి లోటే. మొగుడు కొడుకూ తెచ్చేది వాళ్ళ ఖర్చులుపోను బొటాబొటీ .
శవాల గుర్తింపులు ఇంకా సాగుతూనే వున్నాయి.”ఇంక మేము రాలేము స్వామీ మమ్మల్ని వదిలిపెట్టండి ఆరునెలలైపోయింది .” అని ఒక నమస్కారం పెట్టేశాడు మాలచ్మి మొగుడు.
“అదేంటయ్యా! ప్రేమించుకుని వెళ్ళిపోడానికి ఒక నెల! కాపురం మూడునెలలు! కడుపు ఒక మూడునెలలు! అప్పుడు పిల్లని వదిలెయ్యడం ఒక వారం !చావడానికి రెండు రోజులు..”అని నవ్వాడు అనుభవజ్ఞుడైన ఒక పోలీసాయన. మాలచ్మి ఎదుట అ ఆమాటంటే ఎవరన్నదీ చూడకుండా అతన్ని కొట్టి ఆనక జైలుకెళ్ళేది.మాలచ్మి మొగుడు తమాయించుకుని అతనికి కొక నమస్కారం పెట్టి వచ్చేసాడు.పిల్ల కావాలి శవం వద్దు మాకు మమ్మల్నిక పిలవకండి, అని చెప్పి.
అవునూ! అది ఎవరితోనూ వెళ్ళిపోక, కాలవలో పడి చచ్చిపోక, ఇంటికి రాక ఏమైనట్టూ? ఇట్లా మాయమై పోతున్న పిల్లల గురించీ ఒక నలుగురు ఆడవాళ్ళొ నలుగురు మొగవాళ్ళో కూచుని టీవీలో మాట్లాడుకోరేం ? పట్నం పిల్లలు పోతేనే హడావుడా? నా పిల్ల కోసం నేనే కొవ్వొత్తులు వెలిగిస్తా అని ఒక రోజు గుమ్మం ముందు పదహేడు కొవ్వొత్తులు పెట్టింది మాలచ్మి.
******************************************************************************
చినుకు  వార్షిక సంచిక 2015




No comments: