Sunday, February 26, 2017

శ్రీరామా ఎన్క్లేవ్

               శ్రీరామా ఎన్క్లేవ్
మహా నగరమయితే ఇంకా  కాలేదు గానీ  త్వరగా  అయిపోవాలని మహా ఉవ్విళ్ళూరుతున్న ఒకానొక నగరంలొ, ఒకప్పుడు ఊరి చివరవున్నా  ప్రస్తుతం ఊరి మధ్యకు జరుగుతున్న  ఒక కాలనీలో ఆ మధ్య కట్టిన  ఒక  ఇరవై అరల భవనం  ..ఒక్కొక్క అరకీ మూడు పడక గదులు మూడు స్నానాల గదులు మూడు వసారాలు ,ఎవరోచ్చిందీ  చూడ కుండా గభాలున తలుపు తియ్యకుండా  సురక్షితంగా  వుండడానికి ముందొక ఇనప గ్రిల్లూ, దానికో తలుపూ తలుపుకో తాళం .వసారాలకీ అట్లాగే ఇనప కవచాలూ ,ఎండకి ఎండ కుండా ,వానకి తడవకుండా పకడ బందీ ఏర్పాట్లతో  ముందు వాకిట్లో చిన్న రాముల వారి గుడితో అలరారే ఆ భవనం పేరు శ్రీరామా  ఎన్క్లేవ్
అందులో ఒక అరలో వుంటున్న సూర్యనారాయణని అలారం నెత్తి  మీద మొట్టగా ఉలిక్కి పడి నిద్ర  లేచి, తలకు మఫ్లర్ చుట్టుకుని, రాత్రి వేసుకున్న పాత స్వెట్టర్ విప్పి అమెరికా కూతురు పంపిన కొత్త కోటు తగిలించుకుని వాకింగ్  షూజ్ కట్టుకుని ,తను ఎంత దూరం నడిచిందీ  లెక్క తేల్చే చేతిగడియారం పెట్టుకుని, భార్య ఉషారాణిని  లేపి తలుపు వేసుకోమంటే సణుగుతుందని ,తనే చెయ్యి దూర్చి గ్రిల్ లోపల తాళం వేసి భవనం అంతా దద్దరిలల్లేలాగా పెద్ద శబ్దంతో కారు ఇంజన్ని అదిలించి, రోజూ  ఉదయపు నడకకు వెళ్ళే  పెద్ద స్కూల్ ఆవరణలోకి బయలు దేరాడు ..తల గుడ్డ చుట్టుకుని నిండా దుప్పటి కప్పుకుని కారు హారన్ విని గేటు తియ్యడానికి వచ్చిన భవన కాపలాదారు శ్రీనివాసులుని  కాస్త గట్టిగానే విసుక్కున్నాడు ..అయిదయినా లేవడు వెధవ  
అప్పుడే నడక సంఘం సభ్యులలో చాల మంది కార్లు స్కూటర్లు వచ్చి చేరారు. ఆ సంఘంలో కూడా నాలుగయిదు ఉపసంఘాలున్నాయి .అందులో ఒక ఉప సంఘానికి నాయకుడు సూర్యనారాయణ  ఆయన వేషాన్ని బట్టి ఆ ఉప సంఘ మేదో అర్థం అయిపోతుంది
పక్క పక్కనే నడుస్తూ “ చిల్లర ఎలా మేనేజ్చేస్తున్నారూ ?” అన్నాడు సహ నడక సత్యనారాయణ
“ ఏం చెప్తాం సార్! హాయిగా ఎటిఎం లో తడవకి ఇరవై వేలు తెచ్చుకునే వాళ్ళం .. బ్యాంకులో పదివేలంటే పోయి లైన్లో  నిలబడితే  గంటకి వచ్చా ఇంటికి . ఆ మొదట్లో ఇచ్చిన వందలే మళ్ళీ లేవు అన్నింటికీ కార్దులే ..కూరలు కూడా సూపర్మార్కెట్లో తెచ్చాను మొన్న “
“అదేమిటీ !! మీ ఆవిడకీ మీకూ కూడా రెండు బ్యాంకుల్లో  అకౌట్లున్నాయిగా  ఆవిడ తేలేదా?”
సూర్యనారాయణ మాట్లాడకుండా  “అబ్బో చాలా  టైం అయింది దారిలో పెట్రోల్ కూడా కొట్టించాలీ పదండిపోదాం “అన్నాడు.
“మీరెలా మ్యానేజీ చేస్తున్నారూ ?”  అనడిగాడు సత్యనారాయణ, అటుగా వస్తున్నా మీనాకుమారిని .ఆవిడ నవ్వేసి “ఎదో అలాగే “ అంది .
“మా మీనా శ్రీమహాలక్ష్మి ..ఆవిడ దగ్గర ఎప్పుడు చిల్లర కుప్పలు తెప్పలుగా వుంటుంది .మా ఇంట్లో ఒక పెద్ద చాక్లెట్ సీసా నిండా రూపాయి రెండు రూపాయల బిళ్ళలే...అవికాక ఈ మధ్య సేకరించిన పదిరూపాయల నాణాలు . సూపర్మార్కెట్ కి వెళ్ళినప్పుడల్లా  వెయ్యినోటు మార్చేదికదా !! అందుకని నోట్ల రద్దు మర్నాడు మా ఇంట్లో పది వేలకి సరిపడా వంద నోట్లు దొరికాయి ,”అన్నాడు  మీనాకుమారి భర్త హరిశ్చంద్రరావు ,  ఆవిడ గుర్రు చూపుల్ని లెక్కచెయ్యకుండా .
“ఎదో ఆ డెబిట్ కార్డుల ధర్మమా అని లాక్కొస్తోంది  మా ఆవిడ ..ఇంటి  డబ్బు గోల నాదికాదు పాపం ఆవిడదే! నేనేదో నా ఆఫీసు తంటాలు పడతాను “అన్నాడు రవిబాబు
“ఊరకే గోల పెడుతున్నారు గానండీ బ్యాంకుల్లో ఇప్పుడు వారానికి ఇరవై నాలుగు వేలిస్తున్నారు నిన్న మా డ్రయివర్ కి చేక్కిచ్చి పంపాను. తెచ్చాడు. అందుకోసం మధ్యాహ్నం సెలవిచ్చాను.” శ్రీనివాస రావు
మొత్తానికి వాకర్స్ క్లబ్ సభ్యులకి అంతా బాగానే గడిచి పోతోంది . పెట్రోల్ బంకుల్లో కార్డు తీసుకుంటున్నారు .నోట్ల రద్దుకు పూర్వమే నెల మొదట్లోనే  వాళ్ళ గృహలక్ష్ములు  హోల్ సేల్ బజారులలో బోలెడు బోలెడు సరుకులు తెచ్చిపెట్టుకున్నారు  వాళ్లకి కూడా నోట్ల రద్దు గురించి ముందుస్తు సమాచారం ఏమీ లేదు కానీ, గృహిణి సహజ మైన ముందుచూపూ పొదుపు మనస్తత్వమూ  వుండడాన , కాఫీ పొడులు టీ పొడులు వగైరాలన్నీ నెలకి సరిపడా తెచ్చేసుకున్నారు పాల బూత్ లొ అడ్వాన్సులు కట్టేసుకున్నారు ..
 అంతా సర్దుకున్నట్టే అనుకుంటూ ఇక ఇంటికి పోయి తాజా తాజా గా స్వచ్చమైన పీబెర్రీ కాఫీపొడి పర్కోలేటర్ వేసి ఉషమ్మ  ఇచ్చే పొగలు కక్కే కాఫీ తాగుతూ పేపర్ చదవుకోడమే! శత కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని అన్నీ జరిగిపోతాయి ,ఏవీ ఆగవు . కాపలా దారు పాపం హారన్ వినపడగానే గేటు తీశాడు .ఆవిడ కాఫీ ఇచ్చింది . పేపరూ వచ్చింది..మద్దెల మోగించుకుంటూ .మద్దెల మోతలేకాక , క్యూ లైన్లల్లో కష్టాలు .పని చెయ్యని ఎటిఎంలు ,శోష కొచ్చి పడిపోయిన ముసలాళ్ళు .గాలి జనార్దన రెడ్డి కూతురి పెళ్లి ముచ్చట్లు ,దొరికిన నోట్లు కట్టలు  కట్టలు! .అయినా ముసలాళ్ళని  క్యూలో నించోబెట్టక పొతే ఎవరినైనా పంపచ్చుగా ! ఈ పేపరాళ్ళు కాసింతని గంపంత చేస్తారు ...
మూడో అంతస్తులో వుండే స్వరాజ్యం గారొచ్చారు .
సాయంత్రం తన అరలో సాయిబాబా భజన! భోజనాలు కూడానట ..
ఎల్లుండి రెండో అంతస్తులో వుండే ఝాన్సీ గారింట్లో విష్ణు సహస్రనామ పారాయణ అట ! ఉషమ్మని  రేపూ ఎల్లుండీ ఎక్కడికీ పోవద్దని చెప్పడానికొచ్చింది. .వచ్చేవారంలో ఆవిడ కొడుకూ కోడలూ అమెరికా నుంచీ వస్తారు కనుక  ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఇప్పుడే అయిపోవాలట..అంతలోనే సూర్యనారాయణ ఉషమ్మ ల ఏకైక పుత్రిక నుంచీ ఫేస్ టయిం  కాల్ వచ్చింది బుల్లి మనవరాలి నవ్వులు కేకలు దాని మహత్యాలు ..
అదొక గంట కాలక్షేపం .....
పేపర్లో ఏమీ లేదు అమ్మ మరణం ఆశనిపాతం. అమ్మ అప్పుడిలా నవ్వింది ఇప్పుడిలా ఏడ్చింది ఎంత మంచిదో!  ఎదో ఇంటర్వ్యూ లొ హిందీ పాట కూడా పాడింది ....పత్రికలో ముప్పావువంతు అయిన అమ్మ ..సూర్యనారాయణకి చిరాకు పుట్టింది .ఉషమ్మ చెప్పినట్టు పేపర్ కొనడం మానేస్తే పోయే ! ఎట్లాగూ వార్తా చానెళ్ళ ఇరవై నాలుగు గంటల ఊదర ఉండనె వుందాయే!  ఈ చద్ది ఎందుకు? ఆమాటంటే ఉజ్వల్ గారు ఇంగ్లీషు పేపర్లే చదవండి సార్ ! ఈ మద్దెల ఎక్కడ భరిస్తాం అంటాడు .ఆయన మేధావి కదా!
 క్రింద ఎదో గోల ! మనకెందుకు పోనిద్దూ ! అరగంటగా రణగొణ ధ్వని ! పోనీ ఏమిటో కనుక్కుందామా! అందులో ఇరుక్కుంటే కష్టమౌతుందేమో! పైగా బ్రేక్ఫాస్ట్  వేళ కూడానూ ! తిని  షుగర్ మందేసుకోవాలి ..ఇంటర్ కాం  అదేపనిగా మోగిపోతోంది .సెక్రెటరీ రామచంద్రరావు గారు ..ఒకసారి క్రిందకి రండి సార్ ..
తప్పుదు .. ఆ గోలలో తల పెట్టాల్సిందే .క్రిందకి దిగే సరికే అక్కడ పదిమందీ పోగయి వున్నారు.హరిశ్చంద్ర రావు  గారు,మీనా కుమారి, స్వరాజ్యం గారు  ఇంకా ఒకరిద్దరు .స్వరాజ్యం గారు సాయిబాబా భజన ఏర్పాట్ల కోసం కంగారు పడుతుండగా ఇదొకటి అని పెద్దగానే అనుకుంటోంది . కాపలాదారు కూతురు పదిహేనేళ్ళదానికి రాత్రి నుంచీ ఒకటే కడుపునొప్పి వాంతులు .తెలిసిన ఆరేమ్పీ దగ్గరకి పొతే “అప్పెండిసైటిస్ లాగా వుంది పెద్దాసుపత్రికి తీసుకుపోదాం “కనీసం ఒక పదివేలన్నా పట్రమ్మన్నాడట. ముందుగా పదివేలు తెస్తే తరువాత బిల్లు నెమ్మదిగా కట్టేలాగా తనకి తెలిసిన డాక్టర్ తో మాట్లాడతానన్నాడట.. కాపలాదారు శ్రీనివాసులు పిల్లని ప్రభుత్వాస్పత్రికి తీసుకు పోదాం అన్నాడట .అతని  భార్య భాగ్యలక్ష్మికి  ప్రభుత్వాసుపత్రికి పిల్లని అప్పగించడానికి సుతరామూ ఇష్టంలేదు .ప్రయివేటాస్పత్రి వాళ్ళు ముందుగా డబ్బు కట్టక పొతే చేర్చుకోరు.  కొంతైనా కట్టాలి. పోనీ పాత నోట్లయినా సరే...పాతవైనా కొత్తవైనా ఏవో ఒక నోట్లేవీ వాళ్ళ దగ్గర లేవు .డేబిట్లు క్రెడిట్లూ ఎ కార్డులూ లేవు ఉన్నట్లుంది ఒక పదివేలైనా ఎవరు అప్పు ఇస్తారు? ఇప్పుడెవరూ డబ్బు బయట పెట్టట్లేదే! ఇప్పటికే కడుపు నెప్పి వచ్చి  పది గంటల పైనే అయింది .. శ్రీనివాసులు  భార్య  శోకాలు పెడుతోంది.ఒకళ్ళిద్దరు అప్పుడే లిఫ్ట్ ఎక్కేసి వారి వారి స్వంత అరల్లోకి పోయారు.ఆరేమ్పీ గార్ని పట్టుకుని గవర్మెంటాస్పత్రికి పోదాం అంటే అక్కడ ఆయనకి  పలుకుబడి లేదట .ప్రయివేటు డాక్టర్లే తెలుసట. నొప్పి ! తెరలు తెరలుగా ..శోకం పొరలి పొరలి వచ్చే శోకం
 “మనం తలా వెయ్యి వేసుకున్నా ఇరవై వేలవుతాయి” అంది శ్రీబాల ధైర్యం తెచ్చుకుని
 .ఎవరూ నోరెత్తలేదు
.”ఇరవై నాలుగు వేలిస్తాం అన్నారు మొన్న.. ఆరుగంటలు నిలబడితే పదివేలు చేతిలో పెట్టి క్యాష్ అయిపోయిం దన్నారు ..బ్యాంకులో బ్యాలన్సున్నా మనచేతికోచ్చేది సున్నా.. ఒక వెయ్యి ఇవ్వడం పెద్ద లేక్కేం కాదు కానీ ఎట్లా తెద్దాం?  ఏటీఎం ఎప్పుడూ నోరుమూసుకునే వుంటుంది ఒక వేళ నోరుతెరిచినా ఒక కాయితం ఉమ్మేస్తుంది ..”అన్నాడు  రామచంద్ర రావు
“ శ్రీనివాసులు పదేళ్ళ కాడి నించీ  పంజేస్తన్నాడు ..ఆడికామాత్తరం చేయ్యద్డా మనం?” అంది సత్యనారాయణ తల్లి  సౌభాగ్యమ్మ. .ఆమె వంక కోపంగా చూసాడు ఆయన .
“ప్రయివేటాస్పత్రి అంటే మాటలనుకున్నావా? దోపిడే దోపిడీ ఎక్కడి నించీ తెస్తావు అంత డబ్బు .పదివేలిస్తే ఎక్కడ చాలతాయి ? గవర్నమెంట్  ఆస్పత్రి కి తీసుకుపో! అక్కడే మంచి డాక్టర్లు  వుంటారు” అన్నాడు రామచంద్రరావె మళ్ళీ .
 పిల్ల నొప్పితో మెలికలు తిరిగిపోతోంది,మరొక ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన  రామచంద్ర రావు వెనక్కి వచ్చాడు,.
“ ఇదిగో నేను రెండు వేల కాగితం ఇస్తున్నాను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకొండి” అనేసి విసురుగా  వెళ్ళిపోయాడు
మీనాకుమారి మరో ఇద్దరూ మిగిలారు.
“ఇది మహా పాపం .ఆపిల్ల చచ్చిపోతే బాధ్యులం మనమే ..ఎదో ఒకటి చెయ్యండి  నా దగ్గర ఇప్పటికిప్పుడు అయిదు వేలున్నాయి తెస్తాను “ అంది శ్రీబాల
“ఎం జరుగుతోందిక్కడ “ అని ఇంగ్లీష్ లొ అడుగుతూ అప్పుడే వచ్చాడు ఉజ్వల్ కుమార్
అందరూ కోరస్ లాగా ఏకరువు పెట్టారు తెలుగులో ..
“నాన్సెన్స్ ..ముందాపిల్లని గవర్నమెంట్  హాస్పిటల్ కి తీసుకుపోండి .ట్రీట్ మెంట్ ఇవ్వడం వాళ్ళ డ్యూటీ ..ఇవ్వకపోతే కేసు పెట్టండి .కంప్లయింట్  ఇవ్వండి అసలు ఆరేమ్పీకి అది అప్పెండిసైటిస్  అని ఎట్టా తెలుసు? ఆ సంగతి డిగ్రీ వున్న డాక్టర్ చెప్పాలి ..ప్రయివేట్ ఆస్పత్రికి వెళ్ళడానికి డబ్బుల్లేవని ఆలస్యం చేస్తారేమిటి?” అన్నాడు ఆవేశ పడుతూ
“నేను నా బిడ్డని ఆ ఆస్పత్రికి చచ్చినా తీసుకుపోను .పెద్ద పిల్ల పురుడు పోసి చావు తప్పి కన్ను లోట్టపోయి బయట పడ్డాను.ఒక  మంచం  మీద అటూ ఇటూ ఇద్దరు బాలింతరాళ్లని పడుకో బెట్టారు. అక్కడి నర్సులు ఒకటే కసురు కోడం మమ్మల్ని . దీనికి పెద్దాపరేషన్ చెయ్యాలంట అమ్మో! అక్కడ నేను  చేయించను.” శ్రీనివాసులు భార్య భాగ్యలక్ష్మి
“ నీ బిడ్డకి సరైన వైద్యం చెయ్యాల్సిన డ్యూటీ వాళ్ళది ..వెంటనే  వెళ్ళు  నువ్వు ప్రయివేటాస్పత్రి ఖర్చు భరించలేవు “ఉజ్వల్ కుమార్
.”బాబ్బాబు కాస్త నా ఎంట మీరు రండి మా మాట ఆల్లు వినుకోరు .కాస్త ఇంగ్లీషులో రూల్సు మాట్టాడి అమ్మాయికి ఆపరేషన్ చేపించండి పున్యముంటాది” అని దండం పెట్టాడు శ్రీనివాసులు.
ఉజ్వల్ కుమార్ ఒక్కనిమిషం కంగారుపడి “వద్దును కానీ నాకిప్పుడు పదింటికి  నోట్ల రద్దు మీద రౌండ్ టేబిల్ మీటింగ్ వుంది అర్జంటుగా తయారై వెళ్ళాలి .అందులో మాట్లాడతానని ప్రామిస్ చేసాను “అంటూ  పైకి  వెళ్ళిపోయాడు
ముక్కు మీద వేలువేసుకున్న  శ్రీబాలతో పాటు మరి ఇద్దరు మాత్రమే వుండిపోయారక్కడ..
శ్రీనివాసులు భార్య దుఃఖం క్రమంగా కోపంలోకి మారుతున్నది ఐదో అంతస్తు తొ మొదలుపెట్టి ఎప్పుడెవరెవరు తామింటిల్లపాది  చేత ఎంతెంత పని చేయించు కున్నదీ ఏకరువు పెట్టి ఇప్పుడలా మొండి చెయ్యి చూపించడం లోని న్యాయం గురించి మాట్లాడుతోంది .క్రింద ఇలా జరుగుతుండగా పైన హేమాహేమీలతో చిన్న స్థాయి సమావేశం మరొకటి మొదలైంది. అదీ కొనసాగుతూనే వుంది  పిల్ల నొప్పితో గింగిర్లు తిరుగుతూనే వుంది. స్వరాజ్యం గారు భర్త గారి తొ కలిసి సాయిబాబా భజన కి పూల కోసం పూల మార్కెట్ కి బయల్దేరారు ..అటునించి ఆటే కూరగాయలకి కొబ్బరి కాయలకి
వెడుతూ వెడుతూ “మీరంతా ఎట్లా అంటే అట్లాగే నేనూ ఇస్తాను .పైన రామచంద్రరావుగారు మీటింగ్ పెట్టారు .ఎదో తేలుస్తారు “ అంది శ్రీబాలతో.
“ఆరు తేల్చే దాకా దీని పేణాలుందాలి  కదా !   పోయి ఆటో పిలచుక రా !శ్రీబాలమ్మ ఇస్తానన్న అయిదు వేలు సెకెట్రీ గారిచ్చిన రెండేలూ తీసుకుని పోయి ఆరేమ్పీ గారి కాల్లట్టుకుందాం .ఆరే ఎవరి చేతైనా ఆపరేఃషన్ చేపిస్తారు ఆనక ఎట్టాగో అప్పు తీర్చచ్చు..పైన రాములారే వున్నారు “అంది భాగ్యలక్ష్మి  
పి సత్యవతి
  నవ్యాంధ్ర  ప్రత్యెక సాహిత్య సంచిక లొ ప్రచురితం 


No comments: